Wednesday, November 8, 2017

పల్నాడులో భాసిల్లిన జైనమతం- Jainism


పల్నాడులో  భాసిల్లిన జైనమతం 
జైన మత ఆధ్యాత్మక కేంద్రగా మాచర్ల.

పల్నాడంటే పల్నాటి వీరుల పౌరుష పరాక్రమాలే కాదు సత్యం, అహింసలను బోధించి అనుసరించరించిన గొప్ప జ్ఞానభూమి. ముక్తి కోసం జైనులు ధ్యానం చేసిన ఆధ్యాత్మిక భూమి. ఒకప్పడు పల్నాడులో జైన మతం విరసిల్లిందనే అధారాలు లభ్యమైయ్యాయి. నేను, నా మిత్రులు, ఫేస్బుక్ మిత్రుల సహకారంతో మాచెర్ల పట్టణం లో  జైన మతం ఉనికిని తెలిపే విగ్రహాలు, ఆధారాలను వెలుగులోకి తీసుకువచ్చాం.
 



సమాదుల దొడ్డిలో పార్శ్వనాధుడు..( 1to6 photos)
పాత మాచరల్లోని వీరశైవమతానికి చెందిన కంభాళమఠం వారి సమాదుల దొడ్డిలో సమాదుల మధ్యలో వున్న జైన తీర్ధంకరులు లో  23వ తీర్ణంకరుడైన పార్శ్వనాథుడు విగ్రహం వుంది. నాలుగు అడుగుల ఎతులో వున్న నల్లరాతి విగ్రహం పై అద్బుతమైన శిల్పకళ వుంది. ఏడు పడగల నాగుపాము పడగలో నీడలో పార్శ్వనాధుడు దిగంబరుడుగా కాయత్సర్గ భంగిమ(నిలబడి)వుండగా, ఆయన చుట్టూ 23 తీర్థంకరులు ధ్యాన ముద్రలో వన్నారు. ఆ పైన మూడు పొరల (త్రిస్తర) ఛత్రాలు వున్నాయి. పాదాల వద్ద యక్ష, యక్షిణీలున్నారు. ఈ తీరు శిల్పాన్ని చౌనీసి విగ్రహమంటారు. ఈ చిత్రాలన్ని అందగా చెక్కబడి వున్నాయి.
పోతురాజుగా పూజలందుకుంటున్న  తీర్థంకరుడు..(7to11 photos)






పాత మాచర్ల నాగిరెడ్డి బజార్ పోలేరమ్మ దేవాలయం చాలా పురాతమైంది. గుడి లో  క్రీ.శ. 1313 నాటి కాకతీయ దాన శాసనం ఒకటి  వుంది. ఈ దేవాలయం గర్బగుడి ఎదురు ఒక రాతిపై నాలుగు వైపులా నలుగురి దిగంబరుడి కాయత్సర్ల భంగిమ(నిలబడి)వున్న తీర్థంకరుడి చిత్రాలు చెక్కబడి వున్నాయి. ఈ తీర్థంకరుడి విగ్రహంను స్థానికులు పోతురాజుగా భావించి పూజలు చేస్తున్నారు. అయితే ఆ విగ్రహం పోతురాజు ది కాదు. జైన తీర్ణంకరులలో ఒకరిది, అక్కడ జైన పాదాల ముద్రలు కూడా వున్నాయి.
నాగమయ్య కాదు సుపార్శ్వనాథుడు..(12to16 photos)




మాచర్ల రింగ్ రోడ్డు నుంచి సాగర్ రహదారి లో ప్రభుత్వ కాలేజీ కి వెళ్లే రహదారి ఎదురు వున్న నాగబుద్దుని శివాలయంలో దేవాలయంలో భక్తులచే పూజలందుకుంటున్న నాగమయ్య(నాగబుద్ధుడు) జైన తీర్ణంకరులలో ఏడోవ తీర్ణంకరలులైన సుపార్శ్వనాథుడు. దేవాలయంలో మూడు రాతి సంబాలు వున్నాయి. వాటిలో ఐదు పడగల నాగుపాము నీడలో కూర్చుని ధ్యాన ముద్రలో, ఐదు పడగల నాగుపాము నీడలో కాయత్సర్గ భంగిమ(నిలబడి) వున్న సుపార్శ్వనాథుడి చిత్రాలు చెక్కబడి వున్నాయి. రెండు రాతి స్థంభాలు  పై ముందు భాగంలో, మధ్య స్తంభము  ముందు, వెనుక భాగాలలో ఈ చిత్రాలు చెక్కబడి వున్నాయి.
జైన బసది..

 మాచర్ల మున్సిపల్ రిజర్వాయర్ పక్కన వున్న ఎస్సీ హాసల్ ఆవరణలోని శిధిల కట్టడం జైన బసది అని ప్రస్తుతం దానిని బాగుచేయించి శివాలయంగా మార్చారు. గత ఐదు సంవత్సరాలు క్రితం శిధిల స్థితి లో  ఈ జైన బసది వుండేది. అయితే దీనిలో కొందరు  గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపి ద్వంశం చేశారు. ఆ తరువాత 2013లో దీనిని బాగుచేయించి శివాలయంగా మార్చారు. జైనులు ధ్యానం చేసుకోవటానికి జైన బసదులు ఉపయోగించేవారు.
చెన్నకేశవాలయం జైనాలయమా..?
ప్రసిద్ద మాచర్ల చెన్నకేశాలయం అందుకు పూర్వం జైనాలయం కావచ్చునని పలువురి పరిశోధకుల అభిప్రాయం. 12వ శతాబ్దంలో శివాలయం చెన్నకేశవాలయంగా మార్చబడిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వారు దేవాలయం ముందు పెట్టిన బోర్డులో వుంది. అయితే అంతకు పూర్వం జైనాలయం మని అది శివాలయంగా మారి ఆ తరువాత చెన్నకేశవాలయంగా మార్ప చెందివుంటుందనే విషయాన్ని పలువురు చరిత్ర కారులు అభిప్రాయాలను వెలుబుచ్చారు. నిరూపించే ఆధారాలు లేవు.
పల్నాడులో జైనం..
 జైన మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పుట్టింది. హిందు మతం అంతటి పాతది. జీనడు అంటే అన్నింటినీ జయించిన వాడు అని అర్థం. మతాన్ని ప్రచారం చేసే వారిని తీర్థంకరులు(మార్గదర్శకులు, శాస్త్రములను నిర్మించినవాడు) అని అంటారు. కళింగ రాజైన ఖరవేలుడి ఆదరణ వల్ల కృష్ణానదికి ఉత్తర తీర ప్రాంతాల్లో ముందంజవేసింది. అశోకుడి పత్రడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాలల్లో జైన వ్యాప్తికి కృషి చేశారు.అమరావతి సమీపంలోని వడ్లమాను కొండ పై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడ ఖారవేలుడు మహామేఘా వాహన విహారం నిర్మించాడని తెలుస్తుంది.  చంద్రగుప్తులు , శాతవాహన కాలంలో ఈ ప్రాంతలో జైనమత ప్రచారం జరిగినట్లు పరిశోధకుల అభిప్రాయం. ఆ తరువాత రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయ గణపతి దేవుని వరకు జైన మతం వుందని తెలుస్తుంది. అనంతరం వీరశైవం, వీర వైష్ణం కారణంగా కొన్ని జైనాలయాలు ద్వంశం చేయబడి వాటిని శివాలయాలుగా, వైష్ణవాలయాలుగా మార్చివేయటం జరిగింది. అలానే పల్నాడు ప్రాంతంలో మాచర్లలోని క్రీశ. 641వ సంవత్సరం శాసనం ప్రకారం, మరికొన్ని శాసనాల్లో పల్లినాటి, పల్లినాంటి వీరుడు అని వుందని "పల్లి' అంటే జైన బసదులని, ఆ కాలంలో జైన, బౌద్ధాఆరామాలు ఎక్కువగా వుండటం వలన పల్లినాడు అన్నారని చరిత్రకారుల భావన. మాచర్ల పట్టణంలో బయట పడిన ఈ జైన విగ్రహాలు శాసనాలు లేనందున ఏ కాలం నాటివో చెప్పటం కష్టం. వీటిని పురావస్తు, శిలాతత్వ శాఖ వారు పరీక్షించి కాలం నిర్ణయించాల్సిందే. అలానే వీరశైవ మతస్తులైన కంభాలమఠం సమాదుల దొడ్డిలో నిర్ల క్ష్యానికి గురైన పార్శ్వనాథుడి విగ్రహాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి, జైన మతానికి సంబంధించిన ఇక్కడి అపురూప విగ్రహాలను పరిరక్షించటానికి పురావసుశాఖ ముందుకు రావాలి.
మిత్రులకు ధన్యవాదాలు..
నా కున్న కొద్ది పాటి అవగాహనకు మిత్రుల సహాయ, సహకారాలు ఎంతో విలువైనవి. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరుస్తూ , ప్రోత్సహిసూ సహకరిస్తున్న మిత్రులు, పెద్దలు.
Sriramoju Haragopal , Katta Srinivas , Gopireddy Srinivas Reddy , Siva Racharla ,
Sheik Sadiq Ali , Kiran Kumar Pole , Ramesh Upputholla   గార్లకు ధన్యవాదాలు.

మీ .. పావులూరి సతీష్ బాబు 
Satishbabu Pavuluri


No comments:

Post a Comment